29/12/2024
ఈ రోజు స్వయంపాకం గ్రూపులో పుల్లగోంగూర మరియు ఉల్లిపాయతో రోటి పచ్చడి ఉలా చేసుకోవలో తెలుసుకోండి...
కావలసినవి.
పుల్లగోంగూర కట్టలు - 2.
ఆకును ఒలుచుకుని శుభ్రంగా నీటిలో కడుగుకోవాలి. ఆకును నీడలో ఒక వస్త్రము పై తడి లేకుండా నీడన ఒక అర గంట సేపు ఆర బెట్టు కోవాలి.
పచ్చిమిరపకాయలు - 6
తొడిమలు తీసుకోవాలి .
ఉల్లిపాయలు -2
పై తొక్క తీసుకుని ముక్కలుగా తరుగుకోవాలి.
నూనె - ఆరు స్పూన్లు
పసుపు - పావు స్పూను
ఉప్పు - తగినంత .
పోపునకు.
ఎండు మిరపకాయలు - 6
మెంతులు - అర స్పూను
ఆవాలు - ముప్పావు స్పూను
ఇంగువ - పావు స్పూను లో సగం.
తయారుచేయు విధానము.
ముందుగా స్టౌ మీద బాండీ పెట్టుకుని మూడు స్పూన్లు నూనెను వేసుకోవాలి. నూనె బాగా కాగగానే మెంతులు , ఆవాలు , ఇంగువ మరియు ఎండు మిరపకాయలు వేసుకుని పోపు వేయించుకోవాలి.
ఈ పోపును ఓ ప్లేటులోకి విడిగా తీసుకోవాలి .
తర్వాత తిరిగి స్టౌ మీద బాండీ పెట్టుకుని మిగిలిన మూడు స్పూన్లు నూనెను వేసుకోవాలి . నూనె బాగా కాగగానే గోంగూర ఆకును , పచ్చిమిరపకాయలు మరియు పావు స్పూను పసుపును వేసుకుని మూత పెట్టి ఆకును పది నిముషాల పాటు పూర్తిగా మగ్గ నివ్వాలి. ఆకు మగ్గగానే విడిగా ఓ ప్లేటులోకి తీసుకోవాలి .
తర్వాత రోటిలో ఎండు మిరపకాయలు , వేయించిన పోపును మరియు తగినంత ఉప్పును రోటిలో వేసుకుని పచ్చడి బండతో మెత్తగా దంపుకోవాలి. తర్వాత మగ్గించిన గోంగూర ఆకు మరియు పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని పచ్చడి బండతో మెత్తగా నూరుకోవాలి.
చివరగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను కూడా పచ్చడిలో వేసుకుని పచ్చడి బండతో పచ్చడిని మెత్తగా నూరుకోవాలి. తర్వాత నూరిన పచ్చడిని వేరే గిన్నెలోకి తీసుకోవాలి .
అంతే. భోజనములో వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తినడానికి మరియు పెరుగు అన్నంలో నంచుకుని తినడానికి ఎంతో రుచిగా ఉండే గోంగూర ఉల్లిపాయ రోటి పచ్చడి సర్వింగ్ కు సిద్ధం.
#ఆలూరుకృష్ణప్రసాదు.
సంబంధించిన ర సమయమున తీసినది.